
ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Advertisement
వికారాబాద్, మార్చి 20: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరసోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ త్యాగం, సహనం, ప్రేమ, శాంతి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముప్పై రోజులపాటు కఠిన ఉపవాసాలు, నియమాలను ఆచరించిన అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకునే ఈ పర్వదినం ప్రత్యేకతను ఆయన గుర్తుచేశారు.శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం, సహాయం, దానగుణం వంటి సద్గుణాలను ఈ పవిత్ర రంజాన్ మాసం మనకు నేర్పుతుందని తెలిపారు. మత సామరస్యానికి తెలంగాణ రాష్ట్రం ఒక ప్రతీకగా నిలుస్తోందని, మైనారిటీ లకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధి మరియు మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అదేవిధంగా రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ శాంతి, సౌఖ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
Share this article


