download
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రతి ఇంటికి లబ్ధి:
General

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రతి ఇంటికి లబ్ధి:

Thursday, 12 March 20260 views

Advertisement

వికారాబాద్, మార్చి 12: రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతోందని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ మండలం, ధారూర్ మండలాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్రేపల్లిలో రూ.3.36 కోట్లతో నిర్మించనున్న జిల్లా ఎలక్ట్రికల్ స్టోర్స్‌కు శంకుస్థాపన చేశారు. వికారాబాద్ మండలం జైదుపల్లిలో రూ.2.98 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ధారూర్ మండలం నాగుసాన్‌పల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ధారూర్ మండల కేంద్రంలోని బస్‌స్టాప్ ప్రాంగణంలో రూ.24 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే ధారూర్ మండల కేంద్రంలోని 2BHK కాలనీలో సీసీ రోడ్డు, సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.40 లక్షలతో శంకుస్థాపన చేశారు. అనంతరం ధారూర్ రైతు వేదికలో మండలానికి చెందిన 37 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను స్పీకర్‌గా ఉండడంతో జిల్లాకు అభివృద్ధి నిధులు ఎక్కువగా మంజూరవుతున్నాయని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో రూ.600 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో కోట్‌పల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కోట్‌పల్లి రిజర్వాయర్ ఆధునీకరణకు రూ.90 కోట్లు మంజూరు చేయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే నాగసమందర్ వద్ద కోట్‌పల్లి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.27.50 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో తీసుకున్న భారీ అప్పుల కారణంగా నెలకు రూ.6,500 కోట్ల మిత్తి చెల్లించాల్సి వస్తోందని, అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని స్పీకర్ పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మరిన్ని హామీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

Share this article

Related Articles