
అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష - జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
Advertisement
వికారాబాద్ : 2016 సంవత్సరంలో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల కారాగార శిక్ష, 12,000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిందని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిగి మండలం, ఒక గ్రామానికి చెందిన సుక్కాని అంజయ్య (37) అనే వ్యక్తిపై 2016లో అత్యాచారం మరియు బెదిరింపులకు (IPC సెక్షన్లు 376, 506) సంబంధించి కేసు (Cr No: 268/2016) నమోదైంది. ఈ కేసు విచారణ వికారాబాద్‌లోని మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో కొనసాగింది. పోలీసులు సమర్పించిన పక్కా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి చంద్ర కిషోర్, నిందితుడు అంజయ్య దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 12,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో విశేష కృషి చేసిన అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నాటి దర్యాప్తు అధికారులు వై. నాగేష్ (అప్పటి పరిగి ఎస్సై), పి.ప్రసాద్ (అప్పటి పరిగి సిఐ), ప్రస్తుత పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.హెచ్.ఓ మోహన్ కృష్ణలను , అలాగే కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన అడిషనల్ పి.పి. మెరాజ్ ఫిర్దౌస్, సి.డి.ఓ జగన్ మోహన్ రెడ్డి, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్.నిరంజన్ గౌడ్ ల పనితీరును ఎస్పీ ప్రశంసించారు. మహిళల భద్రత విషయంలో జిల్లా పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్థులు చట్టం నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు.
Share this article


