
ఈ బడ్జెట్ అంకెల గారడి : డా. మెతుకు ఆనంద్ విమర్శలు
Advertisement
వికారాబాద్: ఈ బడ్జెట్ అంకెల గారడి, అరచేతిలో వైకుంఠంలా ఉందని, కొత్త సీసాలో పాత సార పోసినట్లుగా కనిపిస్తోందని 2026-27 రాష్ట్ర బడ్జెట్‌పై డా. మెతుకు ఆనంద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ ద్వారా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం దగా చేసిందని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ నిరాశ చెందారని తెలిపారు. రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించారని అన్నారు. ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు అన్యాయానికి గురయ్యారని, మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఈ బడ్జెట్ వల్ల నష్టపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు పూర్తిగా నెరవేర్చలేదని, ఐదు బడ్జెట్లలో మూడు పూర్తయినా స్పష్టమైన ఫలితాలు కనిపించడంలేదని అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన రాజకీయ తీర్పు ఇస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం అభివృద్ధి కంటే భూముల వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని, రియల్ ఎస్టేట్ వైపు మొగ్గుచూపుతోందని ఆరోపించారు. ఈ విధానాలు కొనసాగితే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని డా. మెతుకు ఆనంద్ పేర్కొన్నారు.
Share this article


