
బెట్టింగ్ నిర్మూలిద్దాం – యువతను కాపాడుకుందాం
Advertisement
వికారాబాద్: ఐపీఎల్ సందర్భంగా జరుగుతున్న అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ టౌన్ సీఐ కే. రఘు కుమార్ హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బెట్టింగ్‌ను పూర్తిగా నివారించాలని ఆయన సూచించారు. ఐపీఎల్‌ను కేవలం ఆటగా మాత్రమే ఆస్వాదించాలని, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో బెట్టింగ్‌లో పాల్గొనడం ప్రమాదకరమని సీఐ తెలిపారు. చిన్న మొత్తాలతో ప్రారంభమయ్యే బెట్టింగ్ క్రమంగా పెద్ద మొత్తాలకు పెరిగి, డబ్బులు కోల్పోయిన తర్వాత కుటుంబ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో యువత తీవ్ర నిర్ణయాలకు దిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారు ఆన్‌లైన్‌లో క్రికెట్ చూస్తున్నారా, బెట్టింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారా అనే విషయాలను గమనించాలని సూచించారు. ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం ఉంటే 8712670030 నంబర్‌కు తెలియజేయాలని, అందిన సమాచారం ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రఘు కుమార్ స్పష్టం చేశారు.
Share this article


