
కుల దౌర్జన్యంతో పసికందు హత్య అమానుషం: POW రాష్ట్ర కార్యదర్శి వై గీత
Advertisement
వికారాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా తాండూర్ మండలంలో కుమ్మేర మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న పసికందు హత్య ఘటనపై ప్రగతిశీల మహిళా సంఘం (POW) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత ఈ ఘటనను క్రూరత్వానికి, కుల దురహంకారానికి నిదర్శనంగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు. దైవ దర్శనం కోసం వచ్చిన చాకలి కుటుంబంపై అగ్రకుల దౌర్జన్యం ప్రదర్శించి, తల్లి కళ్లముందే పొత్తిలో ఉన్న శిశువును హత్య చేయడం సభ్య సమాజాన్ని తలదించుకునే ఘటన అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించడం, దాడి చేయడం, గదిలో బంధించడం వంటి చర్యలు మహిళల గౌరవం, దళిత–బీసీ సమాజాల హక్కులపై దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయకపోవడం ఆందోళనకరమని, వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కేసు విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
Share this article


