
ప్రజాప్రతినిధులు ప్రజల కోసం నిబద్ధతతో పనిచేయాలి: స్పీకర్
Advertisement
వికారాబాద్, మార్చి 12: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పరిపాలన కొనసాగుతోందని, ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ. గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమం ద్వారా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలు, విధులపై పూర్తి అవగాహన పొందుతారని తెలిపారు. ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, డ్వాక్రా మహిళలకు ఉచిత రుణాలు వంటి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలు, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేసి మిగతా సమయంలో అందరూ కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే జిల్లాకు నిధులు మంజూరు చేయించే బాధ్యత తమదైతే, వాటిని సమర్థవంతంగా వినియోగించే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యుడు బి. మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా తదితర జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Share this article


