
ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ప్రతీక్ జైన్
Advertisement
వికారాబాద్: జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వికారాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుదీర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వరి, అడిషనల్ ఎస్పీ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు. ప్రశ్నపత్రాల రవాణా నుంచి కేంద్రాలకు చేరేవరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో 16,400 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 28 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు 13,579 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 144 కేంద్రాలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ ఎస్కార్ట్ మధ్య రూట్ల వారీగా తరలించేలా చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తూ తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించామని తెలిపారు. ప్రతి కేంద్రంలో తాగునీరు, పరిశుభ్రత, ఫర్నిచర్ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని, సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఇంటర్, టెన్త్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇంటర్ విద్యాధికారి శంకర్ నాయక్, డీఈఓ రేణుకాదేవి, డీపీఓ జయసుధ, ఆర్టీసీ ఆర్‌ఎం నమ్రత తదితరులు పాల్గొన్నారు.
Share this article


