ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
19 Views

వికారాబాద్:ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 106 ఫిర్యాదులను అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పి సీఈఓ జానకి రెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్ లతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఇట్టి దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉంచరాదని అన్నారు.అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా తప్పులు దొర్లకొండ వేగవంతంగా ఆన్ లైన్ నమోదు పనులు పూర్తి చేయాలన్నారు. టీం లీడర్లు ప్రతి రోజూ రెండు షిఫ్టులలో పనిచేయాలని ఉదయం సాయంత్రం పది మంది చొప్పున 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లతో రోజుకు వెయ్యి దరఖాస్తులను వెబ్ సైట్ లో నమోదు చేయాలని అన్నారు. నమోదు చేసేటప్పుడు దరఖాస్తుదారని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ఎల్పిజి గ్యాస్, పట్టాదారు పాసు బుక్కు నంబరు, ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డు నంబర్లు, తప్పులు దొరలకుండా సరిగా నమోదు చేయాలని సూచించారు. డాటా ఎంట్రీ చేసిన దరఖాస్తులను సురక్షితంగా భద్రపరచాలని, దరఖాస్తులలో ఏమైనా అనుమానాలు ఉంటే దరఖాస్తుదారునికి ఫోన్ చేసి నివృతి చేసుకున్న పిదప తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ఇట్టి పనులలో ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యతతో టీం లీడర్ల సహకారంతో పారదర్శకంగా శనివారం వరకు పూర్తి చేయాలని సూచించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉందని, సంక్రాంతి పండుగకు ముందు ఏర్పాట్లు అన్ని చేసుకొని పండగ తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహించి, జిల్లాలో ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 11న నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులందరూ తమ నివేదికలతో తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.